నంద్యాల, డోన్ లో జరిగిన ప్రజాగళం సభలో సీఎం జగన్ తో పాటు ఆర్థిక శాఖా మంత్రి బుగ్గనపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రైతుల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై మండిపడ్డారు. ప్రజల భూములను జగన్ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటో వేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి 1500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు.
సైకో జగన్ రంగుల పిచ్చోడని, రంగులు వేసుకోవడానికి 3 వేల కోట్లు ఖర్చు పెట్టాడని చురకలంటించారు. ఆ సైకోకు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బడికి, గుడికి, ఆఖరికి చెట్లను కూడా వదలకుండా వైసీపీ రంగులు వేశారని, ఇటువంటి నాయకుడిని ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. 100 మంది సలహాదారులను పెట్టుకొని 700 కోట్లు అప్పజెప్పాడని, సాక్షి పత్రికకు 1000 కోట్ల ప్రకటనలు ఇచ్చాడని దుమ్మెత్తి పోశారు. మందకృష్ణ మాదిగ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తారని అన్నారు.
మద్యంపై వచ్చే 25 వేల కోట్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టారని, ఆ భారాన్ని ప్రజల నెత్తిన మోపిన దుర్మార్గుడు బుగ్గన అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు హరికథలు, పిట్టకథలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. డోన్ టిడిపి అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని, నంద్యాల లోక్ సభ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఆ దొంగలను పట్టుకునే రోజు మే 13 అని వ్యాఖ్యానించారు.