ఏపీలోని ఉద్యోగులంతా నేడు చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టిన సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. దీంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
జగన్ సర్కార్ ఇచ్చిన రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, నియంతృత్వ ధోరణి వీడి సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. విశ్వసనీయతపై ఉద్యోగులడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని హితవు పలికారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా?, ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? అని ప్రశ్నించారు.
రాజకీయ నేతల తరహాలో ఉద్యోగులను హౌస్ అరెస్ట్ చేయడం జగన్ నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్బంధించడం అంటే విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనని స్పష్టం చేశారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు అంకెల గారడీ చేస్తూ జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఉద్యోగులను అగౌరవపరిచే, వారి ఆత్మగౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ వీడాలని హితవు పలికారు. తాము 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కానీ, ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చేయడం జగన్ హయాంలోనే జరిగిందని అన్నారు.