యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం సరికాదని, దానిని వాయిదా వేయాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు.
సీఎంవోలో ఉన్నవారికే పదోన్నతులు పరిమితం చేశారని, కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని, ఆ జాబితాను పునఃపరిశీలించాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలన్నారు.
కాగా, విజయవాడ మూలాలున్న జయ బాడిగ అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఆ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా జయ బాడిగ చరిత్ర సృష్టించారు. మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె కూడా అయిన జయ బాడిగను చంద్రబాబు అభినందించారు. ఆ పదవి సాధించిన తొలి తెలుగు సంతతి మహిళ జయ కావడం సంతోషకరమన్నారు. తన పదవీకాలంలో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.