మరో రెండు రోజుల్లో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చా రు. ఎన్నికలు ఏవైనా సరే.. వైసీపీ పాలనకు బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ అచారక పాలన పోవాలంటే.. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖను రాశారు. ఆ లేఖలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకూ చేసిన దుర్మర్గాలు, అరాచకాలు, అవినీతి గురించి ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో, చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం నిరంతరం దాడికి గురవుతూనే వస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 13వ తేదీన జరగనున్న పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికను కూడా ఒక ప్రహసనంగా మార్చాలని జగన్ కనుసన్నల్లో అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని చంద్రబాబు కోరారు. ప్రలోభాలతో వైసీపీ అక్రమ విధానాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులైన చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని.. పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్‌తో అవగాహనకు వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని, పీడీఎఫ్‌కు ఓటేసినవారు రెండో ప్రాధాన్య ఓటు టీడీపీకి వేయాలని చంద్రబాబు ఓటర్లకు సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు లేఖ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.