సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు నానాటికీ దిగజారుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు సహా విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసకర పాలనను మొదలుబెట్టిన జగన్…ఇటీవల చిత్తూరు జిల్లాలో చంద్రబాబుపై దాడి ఘటన వరకు కొనసాగిస్తూనే ఉన్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు భద్రతపై, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి టీడీపీ ఎంపీ కేశినేని నాని లేఖ కూడా రాశారు. ఇక, తనపై హత్యాయత్నం చేశారని, తనను చంపాలని చూస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలోని అసాధారణ పరిస్థితులు, శాంతి భద్రతలు, అరాచకాలపై ప్రధాని మోడీతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వాటి దృష్ట్యా ఏపీ వ్యవహారాలలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. తన విశేషాధికారాలతో రాష్ట్రపతి ఏపీలో శాంతిభద్రతలను, పరిస్థితులను చక్కదిద్దాలని చంద్రబాబు కోరారు. జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని, రాజ్యాంగ సంస్థలపై కూడా దాడులకు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆ లేఖలో ఆరోపించారు.
జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో హింస, అరాచకం, మానవ హక్కుల ఉల్లంఘన పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని, మతిస్థిమితం లేని వ్యక్తిగా జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. తన పంతం కోసం శాసనమండలిని రద్దు చేసేందుకు జగన్ సిద్ధమయ్యారని, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను సైతం జగన్ లెక్కచేయకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీకి రాజధాని లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల చిత్తూరు పర్యటనలో తనపై దాడి జరిగిందని, కానీ, తనపైనే పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా తనపై జరిగిన దాడుల వివరాలను ఆ లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఆ దాడులపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 9 పేజీల లేఖ రాసిన చంద్రబాబు దానికి అనుబంధంగా 75 పేజీల డాక్యుమెంట్ ని కూడా జత చేశారు.