ఢిల్లీలో చంద్రబాబునాయుడు తాజా మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుండదని చంద్రబాబు తేల్చేసినట్లే. ఎందుకంటే తెలంగాణాలో బీజేపీతో పొత్తు లేదని స్పష్టంగా చెప్పేశారు. అన్నీ నియోజకవర్గాలకు టీడీపీ సింగిలుగానే పోటీచేస్తుందన్నారు. అంటే తెలంగాణాలో బీజేపీతో పొత్తులేదంటే ఏపీలో పొత్తుండే అవకాశాలు దాదాపు లేనట్లే అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తామనే ఊపు బీజేపీకి కనబడుతోంది.
ఒకవేళ ఎక్కడైనా అరాకొరా సీట్లు తక్కువైతే ఏమిచేస్తుందో ఇప్పటివరకు బీజేపీ చెప్పలేదు. కాబట్టి వీలైనన్ని పార్టీలను పొత్తులో కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం కమలంపార్టీకే ఉంది. అలాంటిది బీజేపీ ఏ పార్టీతో కూడా పొత్తుపెట్టుకోవటానికి సిద్ధంగా లేదు. తెలంగాణాలో ఓట్లకోసం టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని, అలాగే ఏపీలో కూడా రెండుపార్టీల మధ్య పొత్తుంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే ఈమధ్య జరిగిన పరిణామాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీచేయాలని డిసైడ్ అయ్యింది.
ఇదే విషయాన్ని చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు. దాని ప్రకారం చూస్తే ఏపీలో కూడా బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేనట్లే. ఎందుకంటే అధికారంలోకి వస్తామనే ఆశలున్న తెలంగాణాలోనే ఇతరపార్టీలతో పొత్తుకు బీజేపీ ఏమాత్రం ఇష్టపడటంలేదు. అలాంటిది ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకుంటామనే నమ్మకంలేని ఏపీలో బీజేపీకి పొత్తు ఏమవసరం. తెలంగాణాలో పొత్తు పెట్టుకోనపుడు ఏపీలో బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటారు?
ఏపీలోని ప్రత్యేక పరిస్ధితుల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ఆలోచించినా తమ్ముళ్ళు వద్దని పదేపదే ఒత్తిడి పెడుతున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువని సీనియర్ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణాలో బీజేపీ వద్దనుకుంటే ఏపీలో ఇతర పార్టీలు వద్దనుకుంటాయి. కాదు కూడదని బీజేపీతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీపైన జనాల్లో ఉండే మంటను భరించటానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాల్సిందే. అందుకనే రెండు రాష్ట్రాల్లోను బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరని ఇప్పటి మాటలను బట్టి అర్ధమవుతోంది. మరి ముందుముందు ఏమవుతుందో చూడాల్సిందే.