ఇటీవల తుపాను ధాటికి ఏపీలోని 15 జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి అయినా సరే రైతులపై కనీస సానుభూతి చూపుతారు. రైతుల దగ్గరకు వెళ్లి వారిని పరామర్శిస్తారు. కానీ, సీఎం జగన్ మాత్రం రూటే సపరేటు. రైతులను అంటరాని వారి మాదిరికగా జగన్ దూరం నుంచి పరామర్శించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గట్టు దగ్గర టెంటు..ఆ టెంట్లో జగన్..ఆయన ముందు బారికేడ్లు…అవతల రైతులు…ఆ రైతులు తెచ్చిన తడిచిన వరి పైరును అంటీముట్లనట్లు జగన్ పట్టుకొని వారితో దూరం నిల్చొని మాట్లాడడంపై ట్రోలింగ్ జరుగుతోంది.
ఇక, ఏడు పదుల వయసులో చంద్రబాబు ప్రతిపక్ష నేత అయి ఉండి కూడా వరి చేలోకి దిగి స్వయంగా వరి పైరును పరిశీలించి రైతులను ఓదార్చిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సిన చంద్రబాబు..రైతులకు కష్టం వచ్చిందని తెలియగానే వారి దగ్గరకు వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాశారు. 22 లక్షల ఎకరాల్లో 10 వేల కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని, మిగ్జామ్ ను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని కోరారు.
కాగా, అనంతపురం జిల్లాలో నక్కదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ (40) అనే అంధురాలు పెన్షన్ తొలగించారని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోదరుడికి రైల్వే ఉద్యోగం వచ్చినందున ప్రభుత్వం ఆమె పింఛను నిలిపివేసిందని తెలుస్తోంది. దీంతో, “కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ… మాటల్లో కాదు చేతల్లో” అంటూ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కర్కశత్వం అని, ఆమె ఆత్మహత్య అత్యంత హృదయ విదారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.