ఏపీ సీఎం చంద్రబాబు పాలనా అనుభవంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వంటి నేత అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని, ఆయనే మరో పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబును పవన్ ఆకాశానికెత్తేశారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నామని, రాష్ట్రం బాగుండాలని కోరుకునే చంద్రబాబే తనకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే తాను పని చేస్తున్నానని, ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరమని, ఆయన మరో 15 ఏళ్లు ఏపీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చంద్రబాబు ప్రేరణగా తీసుకుని తనకు అప్పగించిన శాఖలన్నింటినీ బలోపేతం చేస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతం కావడానికి చంద్రబాబే కారణమని పవన్ కితాబునిచ్చారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎక్కువగా ఉండేవని, అందుకే నెలలోపు లక్ష 55 వేల నీటి కుంటల ఏర్పాటు పూర్తి కావాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. శ్రీ కృష్ణదేవరాయలు చెప్పినట్టు రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్షించారు.