వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని, అయినా కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, శాంతి భద్రతలు పరిరక్షించాలని డీజీపీకి చంద్రబాబు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం శూన్యం. ఇక, తాజాగా మొన్న జగన్ ను పట్టాభి దూషించారన్న మాట వినగానే…అసలు ఇలాంటి భాష తానెప్పుడూ చూడలేదంటూ డీజీపీ ప్రెస్ మీట్ లో చెప్పి జగన్ పై తన స్వామి భక్తి చాటుకున్నారని విమర్శలు వచ్చాయి.
ఇక, తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ నేతలు నానా రకాల స్కెచ్ లు వేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులకు చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టబోనని చంద్రబాబు శపథం చేశారు. మరో రెండున్నరేళ్లలోపే టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ఓ కమిషన్ ను ఏర్పాటు చేస్తామ ని అన్నారు. చట్టపరంగా వ్యవహరించని పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
న్యాయానికి తలొగ్గుతామని, దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు. కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రజలంతా రెచ్చిపోతే జైల్లు సరిపోవని ధ్వజమెత్తారు. కుప్పంలో రౌడీలు, గుండాలు ప్రవేశించారని, తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ దోపిడీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ అధర్మ పాలనపై, అరాచకాలపై ధర్మపోరాటం చేస్తున్నానని చెప్పారు.
తాము పులివెందులకు నీళ్లిస్తే..జగన్ కుప్పానికి నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతులను జగన్ మోసం చేశారని, వ్యవసాయం సంక్షోభంలో ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. కుప్పం ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోనని, ఆటంకాలను ఎదుర్కొని ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.