సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో ప్రసంగించిన చంద్రబాబు…జగన్ను, వైసీపీ నేతలను టార్గెట్ చేసి సంచలన విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు లేరా..? వీళ్లే మగాళ్ల అని అంటూ చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ అసమర్థ సీఎం పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని మండిపడ్డారు.
జగన్ కూతుళ్లు పారిస్,లండన్లలో చదువుతూ ఖరీదైన కార్లలో తిరుగుతున్నారని, కానీ, ఇక్కడ పేదల పిల్లలు బడికి వెళ్లడానికి కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ప్రత్యేక విమానంలో కోట్లు తగలేసి విదేశాలకు వెళ్లారని, కానీ, సామాన్యుల పిల్లలు బడికి వెళ్లడానికి కనీసం సైకిల్ కూడా లేదని ఎద్దేవా చేశారు. పిల్లలు చదువుకోకుండా జగన్ సర్కారు కుట్రలు చేస్తోందని, అమ్మ ఒడి పేరు చెప్పి మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు.
కరెంట్ వాడకం 300 యూనిట్లు దాటితే అమ్మఒడి కట్ చేస్తున్నారని, అమ్మ ఒడి ఒక బూటకం.. ఇంగ్లీష్ మీడియం ఒక నాటకం అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విద్యావ్యవస్థను జగన్ నాశనం చేశారని, వలంటీర్ల ఉద్యోగాలిచ్చి గొప్పలు చెప్పుకుంటోందని చురకలంటించారు. ఒకేసారి 1.60 లక్షల టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. ఎస్వీయూలో ఎంఏ ఎకనమిక్స్ చదివానని, జగన్ ఎక్కడ ఏం చదివారో చెప్పాలని సవాల్ విసిరారు.
జనానికి ఏ సమస్య వచ్చినా టీడీపీనే అండగా నిలబడుతుందని, ఏపీని కాపాడుకునే బాధ్యత కూడా తమ పార్టీదేని భరోసా ఇచ్చారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే భయపడబోమని అన్నారు. వ్యవసాయ మోటార్లు మీటర్లు పెట్టడం.. రైతు మెడకు ఉరి తాడు వేయడమేనని చంద్రబాబు ఫైర్ అయ్యారు.