ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు పదునైన విమర్శలతో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్మాది పాలన నడుస్తోందంటూ జగన్ ను ఎండగడుతోన్న చంద్రబాబు….వైసీపీ సర్కార్ లోపాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. వరుస పర్యటనలతో కార్యకర్తల్లో చంద్రబాబు నయా జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు…జగన్, వైసీపీ నేతలపై పంచ్ లతో అదరగొట్టారు.
ఆత్మలతో మాట్లాడేవాళ్లు కావాలా తమ్ముళ్లూ అంటూ జగన్ పై చంద్రబాబు వేసిన పంచ్ లు వైరల్ అయ్యాయి. మనుషులతో మాట్లాడేవారు కావాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి. ఏపీలో చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం నడుస్తోందని, రేపు జుట్టుకూ పన్ను వేస్తారేమో గుండ్లు కొట్టించుకోండి అంటూ చంద్రబాబు చురకలంటించారు. ఈ మధ్య కొత్తగా వైసీపీ నుంచి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని, అలాంటి కొత్త బిచ్చగాళ్లకు తాను సమాధానం చెప్పాలా అంటూ చంద్రబాబు వైసీపీ నేతల గాలి తీశారు.
చదువు సంధ్య లేకుండా, గాలికి తిరిగిన వారంతా ఒక చోటికి చేరి, ఏమి మాట్లాడుతున్నారో తెలియని వారు తనను ప్రశ్నిస్తున్నారని చురకలంటించారు. బూతుల మంత్రి ఒకరు, బెట్టింగ్ మంత్రి ఒకరు, హవాలా మంత్రి ఒకరు….అంటూ మంత్రులపై చంద్రబాబు వేసిన పంచ్ లకు తెలుగు తమ్ముళ్లు ఈలలు వేశారు.
తొలిసారిగా కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా జలాలపై నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. తనను ఓడించాలని ఎన్నికల ముందు ఇద్దరూ కలిసి పనిచేశారని,ఇప్పుడెందుకు చెయ్యడం లేదని ప్రశ్నించారు. గతంలో నీటి సమస్య వస్తే తానుగవర్నర్, కేసీఆర్ తో మాట్లాడి పరిష్క రించానని చెప్పారు.
ఇద్దరు సీఎంలు కలిసి కృష్ణా జలాలను సముద్రం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా జగన్ ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని అసమర్థ సీఎం జగన్ అని మండిపడ్డారు