ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోడ్ విషయంలో సుప్రీం కోర్టు చెప్పినట్టు 4 వారాల గడువును ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని పాటించలేదన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
ఈ పిటిషన్ల తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన హైకోర్టు..అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. మరోవైపు, ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై రేపు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు స్టేపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. జగన్ సర్కార్ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని, పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని చంద్రబాబు అన్నారు. ఎన్నికలను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయం సరైనదేనని ఈ తీర్పుతో రుజువైందని చంద్రబాబు అన్నారు.
పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందని, కొత్త ఓటర్లకు, అభ్యర్థులకు అవకాశం ఇచ్చేలా తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎస్ఈసీని ప్రభుత్వం రబ్బరుస్టాంపుగా మార్చిందని, వచ్చీ రాగానే నీలం సాహ్ని సుప్రీం మార్గదర్శకాలు చూసుకోకుండా హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు.
మరోవైపు, జగన్ ఉదాసీనతతోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలోని శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం ఘటనను చంద్రబాబు ఖండించారు. దాడులను రాజకీయం చేయడం మాని చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని,సీబీఐ విచారణ జరిపించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.