విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న సిక్కోలులో సింహంలా గర్జించిన చంద్రబాబు…నేడు విజయనగరంలో ‘బొబ్బిలి’ పులిలా గాండ్రించారు. ‘ఇదేం ఖర్మ మన రైతులకు’ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు..జగన్ పై చండ్ర నిప్పులు చెరిగారు. పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో వేసుకోవడం ఏంటని, క్రూరుడైన జగన్ బొమ్మను రైతులు రోజూ చూడాలా? అంటూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సైకో పాలన వద్దని, సైకిల్ పాలన రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ప్రశ్నించారు. ఆ భూమి ఏమైనా ఆయన తాత ఇచ్చాడా? అంటూ రాజారెడ్డిపై సెటైర్లు వేశారు. వ్యవసాయం కొత్తకాదని, అది జగన్‌తోనే రాలేదని… ఆ మాటకొస్తే జగన్‌కు అసలు వ్యవసాయమే తెలియదని అన్నారు. ముందు వ్యవసాయం చేసి ఆ తర్వాతే రాజకీయాల్లోకొచ్చామని అన్నారు. రైతులు తనకు చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నానని, అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
టీడీపీ పాలన రైతులకు స్వర్ణయుగం అని, రైతులు పండించే పంట నేరుగా రైతులకే చేరేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. వలంటీర్ల వ్యవస్థ పెట్టి రైతులపై జగన్ పెత్తనం చలాయిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతాంగం బాగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే రైతుల ఇబ్బందుల గురించి ఎన్టీఆర్, తాను ఆలోచించి రైతులకు గిట్టుబాటు ధర రాని సమయంలో ఆదుకున్నామని గుర్తు చేశారు.
రైతుల ఇబ్బందులు, సమస్యలు తెలిసిన పార్టీ కాబట్టే టీడీపీ జెండాలో నాగలి గుర్తు పెట్టామని వివరించారు. రాష్ట్రానికి, రైతులకు జీవనాడి అయిన పోలవరాన్ని తీసుకెళ్లి గోదావరిలో కలిపేశారని ఆరోపించారు. దేశంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. రైతులను జగన్ ప్రభుత్వం వేధించి భయపెడుతోందని, రైతులను ఆదుకోవడంలో జగన్ పూర్తిగా విఫలయ్యారని ఆరోపించారు.