వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఈ ఆరుగురే… వివేకా చిన బావమరిది, అల్లుడు కూడా అయిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి….వీరు కాక వివేకాతో ఆర్థిక, రాజకీయ విభేదాలున్న కొమ్మా పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లు వివేకా కేసులో అసలు నిందితులు…తాజాగా జగన్ మీడియా వివేకా కేసులో తెరపైకి తెచ్చిన కొత్తకోణం. వివేకా మర్డర్ కేసులో అరెస్టైన కీలక అనుమానితుడు దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డి భార్య తులసమ్మ ఈ ప్రకారం వైఎస్సార్ జిల్లా పులివెందుల న్యాయస్థానంలో ఈ నెల 21న పిటీషన్ దాఖలు చేశారు.
అంటే ఇన్నాళ్లూ విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు, మొన్న అప్రవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా మర్డర్ కేసు సమయంలో సీఐగా పనిచేసిన శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం…అంతా ట్రాష్ అన్న రీతిలో వేసిన ఈ పిటిషన్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. పోనీ ఆ పిటిషన్ లో ఉన్నది కాస్త నిజమనుకున్నా…ఇన్నాళ్లూ శివ శంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అదీ వదిలేద్దాం…కనీసం శంకర రెడ్డిని అదుపులోకి తీసుకున్న మరుసటి రోజు ఎందుకు ఈ పేర్లు బయటపెట్టలేదు? పిటిషన్ ఎందుకు వేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం చాలా కష్టం.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వివేకా హత్య రక్తపు మరకలు టీడీపీకి అంటించాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్ విచారణ సంస్థ అధికారులోతపాటు, ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసు ముద్దాయి సీబీఐ అధికారిపై కేసులు పెట్టారంటే ఎంతగా బరితెగించారో అర్ధమవుతోందని ఫైర్ అయ్యారు.
వివేకాను హత్య చేయించిన వాళ్లకే జగన్ అండగా ఉంటున్నారని, అవినాష్ రెడ్డే హత్యను దాచిపెట్టే ప్రయత్నం చేశారని సీఐ శంకరయ్య సీబీఐకు వాంగ్మూలం ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హత్య కేసు జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాలు అంటే జగన్ రెడ్డి ఆఫీసులు కాదని, పంచాయతీల్లో వాలంటీర్ల పెత్తనమేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఢిల్లీ స్థాయిలో పోరాటానికి టీడీపీ ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు.
తిరుమల వెంకన్నను అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సేవా టిక్కెట్ల ధరలు పెంచారని, భక్తులను వెంకన్నకు దూరం చేస్తూ, వెంకన్న శక్తిని తగ్గించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వెంకన్న జోలికొచ్చిన వారికి చరిత్ర ఉండదని హెచ్చరించారు. స్వామి తనను తాను కాపాడుకోగలరని,అయినప్పటికీ అంతా ఆయన రక్షకులుగా నిలవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని 45.72 అడుగుల మేర నిర్మిస్తేనే నదుల అనుసంధానానికి వీలుంటుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని.. మూడేళ్లైనా అతీగతీ లేదని ఎద్దేవా చేశారు.