మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల పేరుతో ఇళ్లు, ప్రహరీ గోడలను కూల్చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చారన్న అక్కసుతోనే ప్రభుత్వం అక్కడి స్థానికులపై కక్షసాధింపులకు పాల్పడిందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే, ఇప్పటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించడం, ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలోనే ఇప్పటంలో కూల్చివేత ఘటనను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఈ క్రమంలోని తాజాగా మరోసారి ఏపీలోని రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఇప్పటం ఘటనను చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటం గ్రామంలో కాదు ఇక్కడ వేయండి రోడ్డు అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలంలోని మల్లయ్య స్వామి వద్ద జగనన్న కాలనీలో రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు.
కనీసం, ట్రాక్టర్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఆ రోడ్డు ఉంది అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో రోడ్లు వేయడం కాదని, ఇక్కడ వేయాలని అన్నారు. చెత్త రోడ్లు…చెత్త సీఎం అంటూ చంద్రబాబు హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ఈ క్రమంలోనే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పొలాల మధ్య జగనన్న కాలనీ అంటూ స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, కనీసం రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో అక్కడికి మెటీరియల్ తరలించడం ఇబ్బందికరంగా మారిందని స్థానికులు వాపోతున్న కథనాన్ని ఓ పత్రిక ప్రచురించింది. ఆ కథనాన్ని చంద్రబాబు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.