అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏమి చేసినా అడిగేదెవడురా నా ఇష్టం…మీ ఇళ్లలో గబ్బిళాలనే పెంచండి అంటా నా ఇష్టం…ఓ తెలుగు సినీకవి…ఓ మూర్ఘుడి పాత్రనుద్దేశించి రాసిన ఈ పాట చాలా పాపులర్.
ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ కు ఈ పాట అతికినట్టు సరిపోతుందని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే.
ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్థంగా మారిందని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్నా వైసీపీ నేతలకు చీమ కుట్టినట్టు కూడా లేదు.
ఏపీ సీఎం జగన్ , వైసీపీ నేతలు చేసేవన్నీ ఒప్పులుగా…మిగతా నేతలు చేసేవి తప్పులుగా ఆ పార్టీ కార్యకర్తలకు కనిపించడం దురదృష్టం.
ఇక, గురివింద నలుపు దానికి కనిపించదన్న రీతిలో జగన్ తాను చేసే తప్పులను మరిచిపోయి…ఎదుటివారి తప్పులను మాత్రమే ఎత్తిచూపుతున్న వైనంపై విపక్ష పార్టీలు నవ్విపోతున్నాయి.
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్టు జగన్ తాను చేసిన తప్పులను గుర్తించకపోవడం విశేషం.
ఈ నేపథ్యంలోనే జగన్ చేసిన తప్పులను సూటిగా ఎత్తి చూపించారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.
గతంలో సీఎం హోదాలో ఉన్న తనను పట్టుకొని కాల్చి చంపాలి…చొక్కా పట్టుకొని నిలదీయాలి అని విమర్శించిన జగన్ నేడు ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసులు పెట్టడం ఏమిటని చంద్రబాబు మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రావా? అని ప్రశ్నించారు.
రఘురామరాజును హింసించారనే విషయం సుప్రీంకోర్టులో తేలిందని, ప్రశ్నిస్తే కక్షపూరితంగా హింసిస్తారా అని నిలదీశారు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారా అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి… అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని జగన్ కు చంద్రబాబు హితవు పలికారు.
నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాలపై కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైందని, ఇకనైనా నిబంధనలు, రాజ్యాంగానికి లోబడి పాలన సాగించాలని హితవు పలికారు.
కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నిని తీసుకువచ్చి యుద్ధప్రాతిపదికన పోలింగ్ నిర్వహించారని ,కోర్టుల ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏపీలో కరోనా ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోందని… ఆక్సిజన్, బెడ్లు దొరక్క ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిపై ఫోకస్ చేయని జగన్.. కక్ష సాధింపులకే పరిమితమవుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే పిలుపుతో కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు కోసం ప్రజలు గుమిగూడారని చంద్రబాబు అన్నారు.
చివరకు ఆనందయ్యను కూడా ప్రభుత్వం బెదిరించిందని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయని… ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని అన్నారు.