టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్ట్ వ్యవహారం ఏపీలో పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ముందస్తు నోటీసు ఇవ్వకుండా నారాయణను హఠాత్తుగా అరెస్టు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణ అరెస్టును టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. నారాయణ అరెస్ట్ ముమ్మాటికీ కక్షసాధింపేనని చంద్రబాబు మండిపడ్డారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకే నారాయణను అరెస్ట్ చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కక్షపూరిత చర్య కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక, జగన్ సర్కారు తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడమే కాకుండా.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులను చేయడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.
మరోవైపు, నారాయణ అక్రమ అరెస్టుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ తన అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ అరెస్ట్ చేయించారని విమర్శించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఎక్కడా జరగలేదని సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెపుతున్నారని… లీకేజీనే లేనప్పుడు నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగా చేసిన అక్రమ అరెస్ట్ ఇదని అన్నారు. ఈ మూడేళ్లలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్ట్ లు చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని అచ్చెన్న ఎద్దేవా చేశారు. ప్రతి అక్రమ అరెస్ట్ కు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను ప్రభుత్వం అరెస్ట్ చేసిందని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల పేరును దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ కేసులతో ఈ విద్యాసంస్థలను దెబ్బతీస్తే… విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. నారాయణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ కు పాల్పడ్డారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో ‘మీ తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు భయపడరు జగన్’ అంటూ ఉమ ధ్వజమెత్తారు.