మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం పేరు ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటంలో జనసేనకు మద్దతిచ్చారన్న కారణంతో అక్కడ చేపట్టిన కూల్చివేతల వ్యవహారం సంచలనం రేపుతోంది. దీంతో, ఇప్పటంలో బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అందుకే, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తోందని ఆయన విమర్శించారు. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు పూర్తి చేసుకున్నారని, ఇక మిగిలింది ప్రభుత్వ పతనమేనని చంద్రబాబు దుయ్యబట్టారు. కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులకు వేదికగా ఏపీ మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అహంకారానికి, అధికార మదానికి దీటైన జవాబు చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. 600 ఇళ్లు ఉన్న ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు విస్తరించడం ఏంటని మండిపడ్డారు. ‘‘మీవి రోడ్లు వేసే మొహాలేనా? అంటూ జగన్ ను, వైసీపీ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇప్పటం వెళుతున్న పవన్ కల్యాణ్ ను అడ్డుకుంటేనో, చీకట్లో తమ పర్యటనపై రాళ్లు వేస్తేనో జగన్ పైచేయి సాధించలేరని చంద్రబాబు హితవు పలికారు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి… ఆ తృప్తి ఏంటో అర్థమవుతుంది అంటూ జగన్ కు హిత బోధ చేశారు.