టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోసారి ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్పై ఆయ న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులను పరామర్శించడం కోసం ముంపు ప్రాంతాలకు వెళ్తే.. సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించడం చేతగాని తనమేనని, ఆయన ఒక దద్దమ్మ అని చంద్రబాబు విమర్శించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన బాబు.. ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
వరదల కారణంగా చోటుసుకున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించడం.. చేతగానితనానికి నిదర్శనమన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు.. విపత్తు నిధులు రూ.1,100 కోట్లను దారిమళ్లించారని ఆరోపించారు.
వరి వేయవద్దంటూ రైతులను సాగుకు దూరం చేస్తున్నారని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని అన్నారు. ఓటీఎస్ పేరుతో రూ.14,261 కోట్ల వసూళ్లు విరమించుకోవాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కట్టనక్కర్లేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు ఉంటాయని చంద్రబాబు హామీ ఇచ్చారు.
‘ప్రజా సమస్యలు చర్చించే సభను కౌరవ సభగా మార్చారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహిస్తాం. మహిళల పట్ల వైసీపీ వైఖరి, ప్రజా సమస్యలపై చర్చిస్తాం. చట్ట వ్యతిరేక నిధుల బదిలీ ప్రక్రియ విరమించుకోవాలి. డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన రూ.2,200 కోట్లు స్వాహా చేశారు.“ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం తెలుపుతుందని చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనపై కేసునమోదు చేయలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై ప్రజాక్షేత్రంతోపాటు కోర్టులోనూ పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.