కుప్పం మున్సిపల్ ఎన్నికలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పెండింగ్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. కుప్పంలో నామినేషన్ల పర్వం నుంచి మొదలైన వైసీపీ నేతల అక్రమాలు పోలింగ్ వరకు కొనసాగాయి. ఈ క్రమంలోనే వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అక్రమాలు చూసి అందరూ సిగ్గుపడాలని దుయ్యబట్టారు.
ఒక చిన్న ఎలక్షన్లో ఈ స్థాయి అక్రమాలు, దొంగ ఓటర్లను పట్టించినా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. ఫంక్షన్ హాళ్లు, ఫామ్ హౌస్లో దొంగ ఓటర్లను పెట్టారని ఆరోపించారు. టీడీపీ ఏజెంట్లను అరెస్ట్ చేశారని, ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రజలు తిరగబడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేస్తోందని, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలా చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని, గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అధికార పార్టీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని, అక్రమాలు, అరాచకాలే పరమావధిగా మారిందని అన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే ధీమాలో వైసీపీ ఉందని, హద్దులు మీరితే పరిస్థితులు చేయి దాటిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ఏపీ నుంచి కూరగాయల పేరుతో బాంబేకి గంజాయి తరలిస్తున్నారని, గంజాయిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని, వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వరకు పోరాడుతామని అన్నారు. అసలు రాష్ట్రంలో ఎస్ఈసీ ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ అక్రమాలపై ఆధారాలిచ్చినా స్పందించడం లేదని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పైగా ఫిర్యాదులు చేస్తే టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.