చంద్రబాబుకు వయసైపోయింది…చంద్రబాబు ముసలోడయ్యాడు…ఈసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనడం కూడా కష్టమే…వయసు మీదపడుతోన్న చంద్రబాబు పార్టీని నడపడం కష్టమే….ఇలా టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
అయితే,ముసలోడైనా చంద్రబాబే కావాలని జనం అంటున్నారని, అందుకు జగన్, చంద్రబాబు పర్యటనలలో వస్తున్న స్పందనే నిదర్శనమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా తన వయసు గురించి వస్తున్న కామెంట్లపై చంద్రబాబు స్వయంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వయసు 72 ఏళ్లు అని, కానీ, తనలో స్ఫూర్తి మాత్రం 27 ఏళ్ల వయసు యువకుడిలా ఉంటుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాయి.
కడప జిల్లాలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును అక్కడి కార్యకర్తల ఉత్సాహం కట్టిపడేసింది. దీంతో, తన వయసు, స్ఫూర్తి గురించి చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదని, జాబ్ కేలండర్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. తన సొంత జిల్లా కడపకు జగన్ ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో యువతకు అధిక ప్రాధాన్యతనిస్తానని చంద్రబాబు ప్రకటించారు.
ఇక, ఏపీ కోటాలో త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో రాజ్యసభకు అర్హులైన వారు, పెద్దల సభలో రాణించే సత్తా ఉన్న వారు లేరన్న రీతిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని జగన్ ఎంపిక చేయడంపై ఆయన మండిపడ్డారు. ఏపీలో నాయకులే లేనట్లు, వెనుకబడిన వర్గాల నేతలే లేనట్లు జగన్ వారిని ఎంపిక చేశారని విమర్శించారు. తనను ప్రశ్నించే వారే లేరన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారని, ఈ తరహా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.