ఏపీ మాజీ సీఎం జగన్ కు స్కెచ్ రెడీ అవుతోందా? పోలవరం కేంద్రంగా.. జగన్‌ను చట్టపరంగానే ఇరుకున పెట్టేందుకు శిక్షించేందుకు సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. జగన్‌ను తాను క్షమించలేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును అన్ని విధాలా ఆయన ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో జగన్‌దే పెద్దపాత్ర అని వ్యాఖ్యానించారు. అందుకే తాను ఆయనను క్షమించలేక పోతున్నట్టు వెల్లడించారు.
ఈ పరిణామాలను చూస్తే.. చంద్రబాబు తన గేమ్ స్టార్ట్ చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చంద్రబా బు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు పనులను ఆయన నిశితంగా గమనించారు. ఎక్కడ పనులు ఆగిపోయాయి? గత ఐదేళ్లలో జగన్ ఏం చేశారు? ఎందుకు నిలిచిపోయింది? వంటి పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జగన్ నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించినట్టు తెలిపారు. కానీ, జగన్ పాలనలో మొత్తం నాశనం చేశారని వ్యాఖ్యానించారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను రివర్స్ బాట పట్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఏజెన్సీ నవయుగకు దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెట్టింది పేరని.. అలాంటి కంపెనీని రాజకీయ కక్ష సాధింపుతో వెళ్లగొట్టారని చంద్రబాబు ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్‌ను కాపాడుకోలేదన్నారు. కనీసం ఎవరిని సలహా అడిగారో.. ఎందుకు ఇలా నాశనం చేశారో..జగన్ చెప్పాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎవరు తప్పులు చేసినా తాను వదిలిపెట్టబోనన్నారు.
ఏంటి విషయం..?
చంద్రబాబు హయాంలో నవయుగ కంపెనీకి పోలవరం ప్రాజెక్టును అప్పగించారు. ఇది.. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు.. తనయుడు కిరణ్ కుమార్ వియ్యంకుడి సంస్థ. ఈ కారణంగానే.. జగన్ ఈ సంస్థను పోలవరం పనుల నుంచి తప్పించారు. దీంతో ఆ సంస్థ రాష్ట్రంలోని ఏ పనులూ చేయబోమని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో పలు పనులు చేసిన విశ్వసనీయ సంస్థగా పేరు తెచ్చుకుంది. ఈ పరిణామం.. చంద్రబాబుకు ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ గుట్టును బయటకు లాగి.. జగన్‌ను ఇరుకున పెట్టడం ఖాయంగా చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.