ఏపీ పోలీస్ బాస్.. డీజీపీ.. గౌతం సవాంగ్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబు లేఖ సంధించారు.
వాస్తవానికి డీజీపీకి ఇటీవల కాలంలో చంద్రబాబు లేఖలురాస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాసినలేఖలో.. మరోసారి ఆయన డీజీపీపై ఫైరయ్యారు.
రాష్ట్రంలో అప్రకటిత పోలీస్ రాజ్యం నడుస్తోందా? అని బాబు నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అక్రమ కేసులు ఎందుకు పెట్టారంటూ.. ఆయన నిలదీశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేసిన ప్రభాకర్‌పై ఎలా అక్రమ కేసులు పెడతారని ప్రశ్నించారు.
ఇంత దారుణమా?
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో తహసీల్దార్‌కు వినతిపత్రమిచ్చి, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం పైనే పోలీసుల దృష్టి సారిస్తున్నారన్నారు. విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే అశాస్త్రీయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
నిరసన ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వరసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలతో ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
మాకూ టైం వస్తుంది!
“రాబోయే రోజులకు.. పోలీసుల ప్రస్తుత పనితీరు బ్లాక్ మార్క్“గా ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదని డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.
ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఏవైనా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులనూ పోలీసుల విభాగం వేధిస్తోందని, వారిని చట్టవిరుద్ధంగా గృహ నిర్బంధాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
తప్పుడు కేసులతో నిర్బంధించి వేధిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ నిర్బంధాలు, అరెస్టుల ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని అన్నారు.
ఇదీ బాబు హెచ్చరిక
ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయన్న చంద్రబాబు… టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసుల దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకుని, నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు.. ప్రభుత్వాలు శాశ్వతం కాదని.. రేపు మేం అధికారంలోకి వచ్చాక.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందో .. ఆలోచించుకోవాలని.. తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరి దీనిపై డీజీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.