ఏపీ సీఎం జగన్‌పై తరచుగా విమర్శలు గుప్పించే టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే రేంజ్లో విరుచుకుపడ్డారు. జగన్ పుట్టింది.. ఏపీని విధ్వంసం చేయటానికేనని సంచలన వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రే రాజధాని అమరావతిని సర్వనాశనం చేయడం బాధాకరమని, రాష్ట్ర విభజ న కంటే సైకో సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు.
పులివెందులలో గన్ కల్చర్‌పై జగన్ సమాధానం చెప్పాలని, గొడ్డలి, గంజాయి కల్చర్‌కు జగన్ కారణమని విమర్శించారు. ఏపీలో జగన్ సర్కార్‌పై తిరుగుబాటు ప్రారంభమైందని, ఏపీ పునర్నిర్మాణం కోసం టీడీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. ఏపీలో జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని, జగన్ పాలనతో 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు విమర్శించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. రాజశేఖరరెడ్డి కూడా రాష్ట్రాభివృద్ధిని కొనసాగించారని, కేసీఆర్ సహా.. తన తర్వాత వచ్చిన సీఎంలు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే.. దీనికి భిన్నంగా జగన్.. వ్యవహరిస్తూ.. ఏపీని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెంను విడుదల చేసిన కేంద్రం, ప్రధాని మోడీకి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ను గౌరవించటం అంటే దేశాన్ని గౌరవించటమే అని చంద్రబాబు అన్నారు.