బీఆర్ఎస్ అంటూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ముందుకు పోవాలన్న ఆలోచనతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే, కేసీఆర్ కన్నా రాజకీయాలలో సీనియర్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలపై ఎందుకు ఫోకస్ చేయకూడదు?
కేసీఆర్ తో పోలిస్తే అపార రాజకీయ అనుభవం ఉండి అపర చాణక్యుడిగా జాతీయ స్థాయిలో పేరున్న చంద్రబాబు దేశ రాజకీయాలపై ఎందుకు దృష్టి సారించకూడదు? అన్న ప్రశ్నలు సగటు టీడీపీ కార్యకర్తకు కలుగక మానవు. దేశ రాజకీయాల్లోకి చంద్రబాబు ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన సగటు కార్యకర్తకే కాదు..సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకూ వచ్చింది. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి సారించాలని రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు ప్రజాస్వామ్యం పట్టదని, రాజ్యాంగంపై అసలు అవగాహనే లేదని రామకృష్ణ అన్నారు. మోదీ, షాల మద్దతు లేకుంటే జగన్ ఒక్క రోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేసులున్నా, అవినీతి నిరూపితమైనా జగన్ పై చర్యలు ఉండవని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
టీడీపీ, జనసేనలతో కలసి పని చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. విశాఖను విజయసాయిరెడ్డి దోచుకుంటున్నారని, ఢిల్లీలో ఆయనకు ఉన్నంత పవర్ మరెవరికీ లేదని విమర్శించారు. బీజేపీ కుట్రలు పవన్ కు అర్థమయ్యాయని చెప్పారు.