ప్రపంచంలో అత్యంత చౌకైనది.. తేలికైనది.. సులువైనది.. ఒకరి మీద ముద్ర వేసేయటం. నిజానికి ఈ తీరుకు పెద్ద తెలివి కూడా అక్కర్లేదు. నోటికి వచ్చినట్లుగాఏమైనా మాట్లాడేసే అలవాటు ఉంటే చాలు. ఎదుటోళ్లు అడిగే ప్రశ్నల్ని పట్టించుకోకుండా నిరంతరం తొండి వాదనల్ని వినిపిస్తే సరిపోతుందన్నట్లుగా బిహేవ్ చేసే వారిని చూస్తే.. నిద్ర నటించే వారిని నిద్ర లేపటంతో సమానంగా చెప్పొచ్చు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సోదరుడు వైఎస్ వివేకా తన ఇంట్లో అత్యంత దారుణంగా హత్యకు గురైన వైనంపై ఏపీ అధికార పక్షం వినిపిస్తున్న వాదనలు.. సంధిస్తున్న ప్రశ్నల్ని చూస్తే విస్మయానికి గురి కావాల్సిందే. వారి ప్రశ్నల్లో కనిపించే మౌలిక అంశాల్ని వారెలా మిస్ అయ్యారన్నది ప్రశ్న. అంతేనా.. గంటల కొద్దీ వాదనలు వినిపించే వారంతా తర్కానికి దూరంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
వైఎస్ వివేకానంద దారుణ హత్యకు అసలుసిసలు కారణం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిగా వివేక కుమార్తె సునీత.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలలు ఆరోపిస్తున్నారు. దీనిపై జగన్ అండ్ కో కౌంటర్ ఇస్తూ బోలెడన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నారు. వాటిని చూస్తే..
– 2019లో కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్ ను జగన్ ఖరారు చేస్తే.. అవినాశ్ గెలుపు కోసం చివరి వరకు వివేకా కృషి చేస్తే.. సునీత దుష్ప్రచారం చేస్తున్నారు
– వివేకా రెండో వివాహంతోనే ఆ కుటుంబంలో విభేదాలు.
– ఆస్తి.. రాజకీయ వారసత్వం కోసం పంతం పట్టిన సునీత దంపతులు
– వివేకాను భౌతికంగా అంతం చేసిందీ ఎల్లో గ్యాంగే
– తండ్రి హంతకులు.. కుట్రదారులతో సునీత దంపతులు సఖ్యతగా ఉంటున్నారు
ఇలా.. తమకు తోచినన్ని మరకల్ని సునీతకు అతికించివేస్తున్నారు. అయినప్పటికీ అవన్నీ నిజాలే అనుకుందాం. ఎందుకుంటే.. హేతుబద్ధతతో పాటు.. తర్కంతో ప్రశ్నలు సంధించటానికి ముందు.. ఆరోపణల్ని వాస్తవాలుగా భావించి మాట్లాడుకుంటే.. అసలు నిజం ఎంత? అన్నది ఇట్టే అర్థమవుతుంది.
ఎవరెన్ని చెప్పినా దారుణంగా హత్యకు గురైన వివేకానంద ఇప్పుడు లేరు. ఆయన తన వాదనను వినిపించలేరు. తనను హత్యకు కారణమైనవారిని.. తనను పాశవికంగా చంపిన వారి గురించి మాట్లాడటం సాధ్యం కాదు. ఇలాంటి వేళ.. ఆయనకు సంబంధించిన ఏ మాట అయినా అనేయొచ్చు. అవినాశ్ గెలుపు కోసం వివేకా ప్రయత్నం చేశారని.. అందుకోసం విపరీతంగా శ్రమించినట్లుగా చెప్పే వర్గం.. అదే సమయంలో ఆయనకు రెండో వివాహం గురించి మరక వేయటాన్ని ఎలా చూడాలి?
వివేకా రెండో పెళ్లి తర్వాతే ఆస్తి.. రాజకీయ వారసత్వం కోసం సునీత దంపతులు కిందా మీదా పడుతున్నట్లుగా వాదనలు వినిపించే వారంతా.. నిజంగానే వారికి అలాంటి ఉద్దేశం ఉంటే.. ఏపీ అధికార పార్టీతో కలిసి పోతేనే ప్రయోజనం ఉంటుంది కదా? మరి.. వారు అలా ఎందుకు చేయనట్లు? ఏపీ అధికార పార్టీ అగ్రనేత తమ సొంత సోదరుడు అయినప్పుడు.. రాజకీయంగా పదవులు కానీ..మరి ఇంకేమైనా పొందాలంటే అంతకు మించిన రాజమార్గం ఇంకేం ఉంటుంది?
సునీత దంపతుల్ని టార్గెట్ చేసేటోళ్లంతా చంద్రబాబు నాయుడ్ని సీన్లోకి తీసుకొచ్చి.. ఆయన చేతిలో సునీత కీలుబొమ్మ అనే మాటనే వాదనలో భాగంగా తీసుకుంటే.. అలా చేయటం వల్ల సునీతకు కలిగే ప్రయోజనం ఏమిటి?
సొంత సోదరుడ్నివదిలేసి.. సంబంధం లేని బాబు చేతిలో కీలుబొమ్మగా మారితే ఆమెకు వచ్చే రాజకీయ.. ఆర్థిక ప్రయోజనాలు ఏముంటాయి? ఎందుకంటే బాబు చేతిలో ఇప్పుడు అధికారం లేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. అలాంటప్పుడు ఆయనతో అంటకాగాల్సిన అవసరం ఏమిటి? తెలివి ఉన్న వారెవరైనా సరే.. సోదరుడు జగన్ తోనే సఖ్యతగా ఉంటారు కదా? అలా చేయకుండా తన తండ్రిని చంపిన వారు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం కోసం ఆమె ఐదేళ్లకు పైనే ఎందుకు వెయిట్ చేస్తూ ఉండాలి? అన్నది ప్రశ్న.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అన్న.. తమ్ముడు.. అక్కా.. చెల్లెలు అంటూ మాట్లాడే వ్యక్తికి అక్కగా రక్త సంబంధం ఉండిన సునీతకు న్యాయం జరిగేలా.. తన బాబాయ్ ను దారుణంగా చంపేసిన వారు ఎవరన్న విషయాన్ని ఐదేళ్లు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తేల్చలేకపోవటమేంటి? వివేకాను భౌతికంగా అంతం చేసింది ఎల్లో గ్యాంగే అంటూ తీవ్ర ఆరోపణలు చేసే అధికారపక్షం నిజమే మాట్లాడుతుందని అనుకుందాం. అలాంటప్పుడు గడిచిన ఐదేళ్లుగా అధికారంలో ఉన్నది హత్యకు గురైన బాబాయ్ గారి అబ్బాయే కదా? మరి.. దోషుల్ని ఎందుకు పట్టుకోలేదు? కేసు సీబీఐ చూస్తున్నదే అనుకున్నా.. రాష్ట్రంలోని పోలీస్ అంతా చేతిలో ఉన్నప్పుడు.. నేరస్తుల వివరాల్ని.. అందుకు సంబంధించిన ఆధారాల్ని చూపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి కదా?
ఒకవేళ ఏదైనా సరే.. మేనేజ్ చేసే చంద్రబాబుకున్న టాలెంట్ కారణంగా వివేకాను అమానుషంగా హత్య చేసినోళ్లపై చర్యలు తీసుకునే సత్తా అధికార వ్యవస్థలకు లేవనే అనుకుందాం. ఎందుకుంటే.. అంతటి శక్తి సామర్థ్యలు చంద్రబాబుకు ఉన్నాయని అనుకుందాం. ఆయన మేనేజ్ మెంట్ కారణంగా తమ చేతిలో రాష్ట్ర పగ్గాలు ఉన్నా కుదరట్లేదనే అనుకుందాం. తమ చేతిలో ఉన్న అద్భుతమైన నిజాల్ని.. వాస్తవాల్ని.. ఆధారాల్ని తమ సొంత మీడియాలో ప్రత్యేక సంచికలు వేసి మరీ పబ్లిష్ చేసే అవకాశం ఉంది కదా? మరి.. అలా ఎందుకు చేయనట్లు? అన్నది ప్రశ్న.
బాబు చేతిలో సునీత కీలుబొమ్మగా మారటం వల్ల ఆమెకు లాభం కంటే నష్టమే ఎక్కువన్నది చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతారు. అలాంటిది పెద్ద డాక్టర్ గా పేరున్న సునీతకు ఆ మాత్రం లాజిక్ తెలీనంత అల్ప స్థితిలో ఉన్నారా? అన్నది ఒక సందేహం. ఒకవేళ.. బాబు కుట్రలో సునీత భాగస్వామ్యం అయ్యారనుకుందాం. దీనికి ఆమెకు కలిగే రాజకీయ.. సామాజిక.. ఆర్థిక ప్రయోజనం ఏమిటి? మరేం లేనప్పటికీ అలా ఎలా టార్గెట్ చేస్తారు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే అన్ని ప్రశ్నలకు ఆటోమేటిక్ గా సమాధానాలు వచ్చేస్తాయి మరి.