ఆరు నూరైనా, నూరు ఆరైనా రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని టీడీపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలకు దగ్గరవుతూనే మరో వైపు పార్టీ ప్రక్షాళనకు చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నేతల పని తీరుపై కన్నేసి ఉంచిన ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది.
ప్రతి నియోజకవర్గంలో నేతల పని తీరును పరిశీలిస్తున్న చంద్రబాబు ప్రక్షాళనపై దృష్టి పెట్టారు. అవసరమైన చోట మార్పులు, చేర్పులకు రెడీ అవుతున్నారు. అంతకుముందు కంటే భిన్నంగా ఆయన ఈ విషయంలో చివరి వరకు నాన్చకుండా ముందే తేల్చేయాలని నిర్ణయించారు. పనిచేయని నేతలకు టికెట్లు ఇవ్వరాదని, ఆ విషయంలో కాస్త గట్టిగానే ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.
తాజాగా జరిగిన సమీక్షలు, సమావేశాల్లో చంద్రబాబు పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. పార్టీలో పని చేస్తారా.. లేక తప్పుకుంటారా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం పని చేయలేని వారు ఉంటే తప్పుకోవాలని ప్రత్యామ్నాయం చూసుకుంటామని తేల్చి చెప్పడంతో నేతలు షాక్ అవుతున్నారు. పని చేస్తానని చెబుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు వారిని హెచ్చరిస్తున్నారు.
తన వద్ద ఉన్న సర్వే రిపోర్టుల ప్రకారం నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్ ల మార్పుకు నిర్ణయం తీసుకుని వాటిని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాల నిర్వాహణలో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు చంద్రబాబు సీరియస్ వార్నింగ్ లతో మళ్ళీ నియోజకవర్గాల్లో బిజీ అవుతున్నారు.
ఇంకొకవైపు రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేయటం కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. పొత్తులపై క్లారిటీ వస్తుందని నేతలు భావిస్తున్న సమయంలో 175 సీట్లలో విజయం అనే మాట చంద్రబాబు నోటి నుంచి రావడంతో క్యాడర్ కూడా స్పష్టతకు వస్తున్నారు.
మరోవైపు పార్టీ నేతల పనితీరుపై కొంత అసంతృప్తితో ఉన్న టీడీపీ అధిష్టానం ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఫోకస్ పెట్టింది. పని తీరు సరిగ్గా లేని నేతలను పక్కకు పెట్టి ద్వితీయ శ్రేణి నేతలకు అక్కడ అవకాశం కల్పించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. అలాగే అనేక నియోజకవర్గాలో టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు అధిష్టానానికి అందుతున్నాయి. పార్టీ కార్యక్రమాల నిర్వాహణ , ఇతర అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకోని నేతలకు ఉద్వాసన పలికి ఆయా స్థానాల్లో కొత్త వారికి ,ఆశావహులకు అవకాశం కల్పించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.