ఏపీ రాజధాని అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే కోర్టు విచారణలో ఉన్న అంశంపై మాట్లాడేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా సుప్రీంకోర్టును సైతం ధిక్కరించి విశాఖే ఏపీకి రాజధాని అని, త్వరలో తాను కూడా అక్కడికి వెళ్ళబోతున్నానని స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు షాక్ ఇస్తూ పార్లమెంటులో అమరావతి ఏపీ రాజధాని అంటూ కేంద్రమంత్రి సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు స్పందించారు.
తనకు లేని అధికారాన్ని జగన్ ఆపాదించుకుంటున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టతరంగా మారిందని చురకలంటించారు. రాజధానిపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు.
శివరామకృష్ణ కమిటీ నివేదికను సుప్రీంకోర్టులో కేంద్రం ప్రస్తావించిందని అన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తమకు పంపిందని, దానిని ఆమోదించామని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసిందని చంద్రబాబు వివరించారు. తమను సంప్రదించకుండానే మూడు రాజధానుల చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం తీసుకువచ్చిందని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశం గురించి స్పష్టంగా ఉందని, అయినా సరే మూడు రాజధానులపై జగన్ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. అమరావతికి అండగా పార్లమెంటు మొత్తం ఉంటుందని, శంకుస్థాపన నాడే ప్రధాని మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు వివరించారు.