ఏపీలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని, పలు చోట్ల పోలింగ్ ను అడ్డుకున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, పోలింగ్ నాడు ప్రారంభమైన ఈ దాడుల పరంపర పోలింగ్ ముగిసిన మరుసటి రోజు కూడా కొనసాగుతోంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన వైనం సంచలనం రేపుతోంది.
స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర నానిపై వైసీపీ కార్యకర్తలు కత్తులు, కర్రలతో దాడి చేసిన వైనం దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
ఓటమికి భయపడిన పిరికిపందలే ఈ దాడికి కారకులని, నానిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు ధ్వజమెత్తారు. నానిపై150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో దాడి చేశారని, ఇటువంటి నేపథ్యంలో ఓటర్ల తీర్పునకు రక్షణ ఏదని చంద్రబాబు ప్రశ్నించారు.
పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాతి రోజు కూడా దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో, ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ఆరోపించారు.
మాచర్ల, తాడిపత్రిలో నిరాటంకంగా దాడులు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని విమర్శించారు. ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.