తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి నేటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి.
1983, మార్చి 29న అన్నగారు ఎన్టీఆర్ టీడీపీని స్తాపించారు. అప్పటి నుంచి అప్రతిహతంగా టీడీపీ దూసుకు పోతూనే ఉంది. అనేక ఇబ్బందులు.. ప్రతిఘటనలు(నాదెండ్ల భాస్కరరావు) వచ్చినా.. తన కీర్తి పతాకను రెప రెపలాడిస్తూనే ఉంది. తాజాగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ఈ సమయం అత్యంత కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడే 42వ వార్షికోత్సవ దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
టీడీపీ 42వ పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ అధినేత చంద్రబాబు నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
“తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహాశయుల స్ఫూర్తిగా.. 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారు ఎన్టీఆర్ గారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పారు“ అని పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చామన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా తెలుగు ప్రజల సేవలో టీడీపీ నిమగ్నమై ఉందన్నారు. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో తెలుగు ప్రజల బంగారు భవిష్యత్తుకు కృషిచేస్తుందన్నారు.