సర్టిఫికెట్ల ఫోర్జరీ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్టు చేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంటనే అశోక్ బాబు బెయిల్ కు దరఖాస్తు చేయగా…నేడు ఆయనకు బెయిల్ లభించింది. ఈ క్రమంలోనే తాజాగా అశోక్ బాబును ఆయన నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.
అశోక్ బాబుకు ధైర్యం చెప్పిన చంద్రబాబు…కస్టడీలో పోలీసుల తీరు, ఏం జరిగింది, కేసు వివరాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జగన్ సర్కార్ పై, జగన్ పై బాబు నిప్పులు చెరిగారు. సీఐడీ అధికారులు అతిగా ప్రవర్తించారని, అశోక్ బాబుపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ రోజు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ శ్రేణులను బాధపెడుతున్నారని, అదే మాదిరిగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ శ్రేణులు కూడా బాధపడతారని హెచ్చరించారు.
మొత్తం 4 వేల మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని, ముగ్గురు మాజీ మంత్రులను, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, బీటెక్ రవి వంటి వ్యక్తులను, నియోజకవర్గ ఇన్చార్జిలను 80 మందిని అరెస్ట్ చేశారని బాబు మండిపడ్డారు. మొత్తం 33 మందిని పొట్టనబెట్టుకున్నారని, టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేశారని, అలాంటివి తాము చేయించలేకనా? అని విరుచుకుపడ్డారు.
మూడేళ్లకే జగన్ కు అంతుంటే 14 ఏళ్లు సీఎంగా చేసిన తనకెంత ఉండాలి? అని ఫైర్ అయ్యారు. సమస్యలు వీళ్లే సృష్టించి, వీళ్లే పరిష్కరించినట్టు నటించి అందరితో బలవంతంగా జేజేలు కొట్టించుకుంటున్నారని సినిమా టికెట్ల వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని, గతంలో మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్ గా ఉన్న వరుణ్ రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్ గా నియమించారని అన్నారు. ఆ నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామన్నారు.