సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ హుటాహుటిన స్పందించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఓ సెమినార్ పెట్టి మరీ ఆ పోస్టులను ఖండించారు. అయితే, అదే తరహాలో టీడీపీ మహిళా నేతలను కించపరుస్తున్నా కనీసం పోలీసులు కూడా స్పందించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వంపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తనపై కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను కామెంట్ చేస్తే సీఐడీ కేసులు పెడుతున్నారని, కానీ, తమపై ఇష్టారీతిన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు శూన్యం అని మండిపడ్డారు. వైఎస్ భారతిపై పోస్టులు పెడితే సెమినార్ నిర్వహించారని, కనీసం తమ కంప్లయింట్ పై పోలీసులు స్పందించడం లేదని వాపోయారు.
తనపై పోస్టులు పెట్టిన వారిపై టీడీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్, ఆయన కుటుంబ సభ్యుల గురించి పోస్టులు పెట్టేందుకు సంస్కారం అడ్డొస్తుందని అన్నారు. తనుకు అర్ధరాత్రి కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతున్నారని, సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి అయిననప్పటి నుంచి ఈ బెదిరింపులు, అసభ్యకర పోస్టులు పెరిగాయని ఆరోపించారు. జాతీయ మహిళా కమిషన్ తమ ఫిర్యాదులపై స్పందిస్తున్నారని అన్నారు. మహిళ హోం మంత్రిగా ఉన్నా ఉపయోగం లేదన్నారు.
ఈ క్రమంలోనే వంగలపూడి అనితకు చంద్రబాబు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అసభ్యకర పోస్టుల అంశంలో మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. పార్టీ ఆమె వెంటే ఉందని, పోరాటం కొనసాగించాలని అన్నారు. ఈ పోరాటం స్ఫూర్తిదాయకం అని చంద్రబాబు అభినందించారు.