పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. ఈ హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల అనంతర హింసపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనల గురించి డీజీపీకి వివరించారు. మాచర్లలో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు.
ఇక, ఈ దాడులను టిడిపి నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్ల రామయ్య, అమర్నాథ్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రౌడీలు, గుండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని, ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని వారు ఆరోపించారు. జగన్ కనుసన్నల్లోనే పోలీసులు నడుస్తున్నారని, వైసీపీ అరాచకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం, చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అన్నారు. మాచర్లలో గుండాలు, రౌడీలను ముందుగానే మోహరించి టీడీపీ నేతలపై దాడులు చేయించారని ఆరోపించారు. మాచర్లలో పర్యటించి టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెబుతామని తెలిపారు.
మరోవైపు, రాష్ట్రంలోని హింసాత్మక పరిస్థితులపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. వైసీపీకి పరాజయం తప్పదని డిసైడ్ అయిందని, ఆ అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హింసకు పాల్పడుతున్న వైసీపీ నేతలే పోలీసులను, ఎన్నికల సంఘాన్ని నిందించడం విడ్డూరంగా ఉందని నాగబాబు చురకలంటించారు. వైసీపీ డిఎన్ఏ లోని హింస ఉందని, పులివర్తి నానిపై హత్యాయత్నం అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చే నాడు కూడా వైసీపీ నేతలు మరోసారి హింసకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆరోజు పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.