తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ నటుడు చలపతి రావు(78) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే.. ఆయన మరణానికి ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు కారణమై ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944 మే 8న జన్మించిన చలపతిరావుకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. చలపతిరావు 1200కు పైగా సినిమాల్లో నటించారు. ఏడు సినిమాలను నిర్మించారు. ఇండస్ట్రీలో చలపతి రావుని అందరూ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు.
చలపతిరావు నటించిన మొదటి చిత్రం గూఢచారి 116. చివరి చిత్రం `ఓ మనిషి నీవేవరు`.
ఆ దిగులే కారణమా?
తెలుగు సినీ ప్రపంచంలో 50 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని చలపతిరావు పెంచుకున్నారు. ముఖ్యంగా ఇటీవల మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ, రెండు రోజుల కిందట మరణించిన.. కైకాల సత్యనారాయ ణలతో ఎనలేని అనుబంధం ఉంది. వీరిద్దరి మరణం చలపతిరావును బాగా కుంగదీసింది.ఆయన వీరితో అనేక సినిమాల్లో నటించారు. కుటుంబ సభ్యుడిగా కృష్ణ ఇంట్లోనే ఉండేవారు. ఇక, సత్యనారాయణకు తమ్ముడు కాని తమ్ముడిగా వ్యవహరించారు.ఈ రెండు ఘటనలతో ఆయన మధనపడేవారు.
దీనినే ఆయన తరచుగా ఆలోచించేవారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ఈ దిగులుతోనే ఆయన మానసికంగా కుంగిపోయారని.. అందరినీ పోగొట్టుకుంటున్నానని అనేవారని.. రవిబాబు చెప్పడం గమనార్హం. ఈ దిగులుతోనే ఆయన గుండె పోటుకు గురై ఉంటారని.. సినీవర్గాలు చెబుతున్నాయి.