నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఊపిరి పోసింది. రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విశాఖ ఉక్కుపై స్పెషల్ ఫోకస్ పట్టిన చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి మోదీతో కూడా ఇటీవల ఈ అంశంపై బాబు చర్చలు జరిపారు. ఫైనల్ గా ప్లాంట్ మళ్లీ పుంజుకునేందుకు ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంతో.. చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రోజు ఉక్కుతో చెక్కబడిన ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి `గో ఏపీ` యొక్క స్థిరమైన ప్రయత్నాలకు ప్రతిస్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఇవ్వడం ఆనందించదగ్గ నిర్ణయమని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదు.. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పోరాటాలు మరియు స్ఫూర్తికి స్మారక చిహ్నంగా నిలుస్తుందన్నారు.
అందరి హృదయాల్లో, ముఖ్యంగా వైజాగ్ ప్రజల హృదయాల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు అన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నినాదించారు. ఉక్కు కర్మాగారానికి తమ అచంచలమైన మద్దతు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామికి ఈ సందర్భంగా బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.