శనివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు కొని.. ప్రముఖలందరి వాహనాలు హైదరాబాద్ మహానగర శివారులోని గండిపేట మండలంలోని ఫాంహౌస్ వైపు బారులు తీరాయి. కారణం.. ఉపాసన కొణిదెల ఇచ్చిన ప్రత్యేక పార్టీ. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషన్ పురస్కారానికి ఎంపికైన నేపథ్యంలో ఆయనకు విందు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ పార్టీకి ముఖ్యమంత్రి మొదలు వివిధ రంగాలకు చెందిన ఎంపిక చేసిన ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి పిలిచారు.
పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల వారు ఈ విందుకు హాజరయ్యారు. శనివారం రాత్రి 9.19 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విందుకు హాజరయ్యారు. 10.05 గంటల వరకు ఫాంహౌస్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం వెళ్లిపోయారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. శ్రీధర్ బాబు..ఎమ్మెల్సీ కవిత.. మాజీ మంత్రి డీకే అరుణ.. సినీ నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి తో పాటు పలువురు సినీ..రాజకీయ ప్రముఖులతోపాటు మరికొందరు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విందుకు హాజరై.. పుష్పగుచ్చంతో చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. చిరంజీవికి అవార్డు రావటం అందరికి గర్వకారణంగా పేర్కొన్నారు. చిరును ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. పెద్దగా సమాచారం లేకుండా ఫాంహౌస్ లో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం హై సర్కిల్స్ లో ఆసక్తికర చర్చగా మారింది. కారణం.. పలువురికి ఈ విందుకు ఇన్విటేషన్ రాకపోవటమే.