ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో, అనంతపురం జిల్లా తాడిపత్రిలో, తిరుపతిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతాల్లో ఈసీ 144 సెక్షన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో పాటు, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై ఆ ఇద్దరి నుంచి వివరణ కోరింది. అంతేకాకుండా, వ్యక్తిగతంగా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సిఎస్, డిజిపిలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలోనే సీఎస్ జవహర్ రెడ్డి, డిజిపి హరీష్ కుమార్ గుప్తాలు భేటీ అయ్యారు. డిజిపితో పాటు ఇంటిలిజెంట్ ఎడిజి కుమార్ విశ్వజిత్ కూడా ఈ భేటీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే గురువారం నాడు సీఎస్, డీజీపీ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. పోలింగ్ తదనంతర పరిణామాలు, వాస్తవ పరిస్థితుల గురించి ఈసీకి వారు వివరణ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.