సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించారన్న ప్రచారం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందంలోని ఏఎస్పీ రాంసింగ్‌పై అవినాష్ రెడ్డి సన్నిహితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం గతంలో కలకలం రేపింది.
ఆ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఉదయ్ ఫిర్యాదు చేయడం రాజకీయ దుమారం రేపింది. కడప ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో రాంసింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో, తనపై కేసు నమోదు చేయడాన్ని రాంసింగ్ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో, రాంసింగ్ పై కేసు విచారణలో తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వివేకా కేసు విచారణను ప్రభావితం చేసేలా రాంసింగ్ పై వైసీపీ నేతలే కేసు పెట్టించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో సీబీఐ బృందానికి నేతృత్వం వహిస్తున్న రాంసింగ్ కడపలో అడుగుపెట్టారు. 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విచారణలో రాంసింగ్ పాల్గొన్నారు. శుక్రవారంనాడు వివేకా కేసులో పలువురు అనుమానితులను రాంసింగ్ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సారైనా రాంసింగ్ ను సజావుగా విచారణ చేసుకునేందుకు సహకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.