సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ కోర్టు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి విచారణ కోసం హాజరయ్యారు. జనవరి 28న తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. ఆ రోజు తన లాయర్ ని కూడా విచారణ సమయంలో అనుమతించాలని అవినాష్ చేసిన విజ్ఞప్తిని సీబీఐ అధికారులు తోసిపుచ్చారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అవినాష్ రెడ్డికి ఆనాడే సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అవినాష్ సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, గతంలో మాదిరిగానే మరోసారి అవినాష్ కు సీబీఐ అధికారులు షాకిచ్చారు. ఈసారి కూడా అవినాష్ రెడ్డి లాయర్ ను సీబీఐ అధికారులు విచారణ గదిలోకి అనుమతించలేదు. ఒక ప్రత్యేక గదిలో అవినాష్ రెడ్డిని అధికారులు ఒంటరిగా విచారణ జరుపుతున్నారు. వివేకా మర్డర్ కు స్కెచ్ వేసింది అవినాష్ రెడ్డి ఇంట్లోనే అని సీబీఐ అధికారులు కూడా గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విచారణపై సర్వత్రా తీవ్ర ఆసక్తి ఏర్పడింది.
ఈ క్రమంలోనే నేడు విచారణలో రూ. 40 కోట్ల డీల్ గురించి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ బెయిల్ కౌంటర్ లో సీబీఐ సంచలన విషయాలను పేర్కొన్న విషయంపై రాజకీయ దుమారం రేగింది. హత్య జరిగిన రోజు నిందితులంతా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించినట్టు సీబీఐ తెలిపిందని ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే వివేకా హత్య కుట్ర వ్యవహారం మొత్తం అవినాష్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ విచారణలో తేలినట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో, ఈ రోజు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా, అవినాష్ రెడ్డికి, తద్వారా జగన్ మెడకు వివేకా మర్డర్ కేసు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది.