జనసేనకు కొద్ది నెలల క్రితం గుడ్ బై చెప్పిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ బీజేపీలో, వైసీపీలో చేరబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లకు చెక్ పెడుతూ తాజాగా ఆయన సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ పేరు ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆలోచనల నుంచి ఈ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు.
ప్రజా సేవ చేసేందుకు రాజ్యాధికారం ముఖ్యమని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రజల్లో తిరిగిన సమయంలో తనకు తెలిసిందని లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని చెప్పిన కొందరు నేతలు తమ ప్రయోజనాల కోసం హోదాను వదిలేశారని జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎవరికీ సాష్టాంగ ప్రణామాలు చేయదని, ఎవరికీ తలవంచదని చెప్పుకొచ్చారు.
అవినీతి రహితంగా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ప్రజల సొమ్మును ప్రజలకే చేరేలా చేయడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. సామాజిక కార్యకర్తలను తొక్కేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారిని జైలుకు పంపిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు మానవ హక్కులు సరిగా ఉంటే ఈ పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదన్నారు.