ఏపీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే ఈ ఆక్ట్ అమల్లోకి వస్తే పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ప్రజల భూములను జగన్ లాగేసుకుంటారని వారి భూములు పై వారికి హక్కులు ఉండమని టీడీపీ, జనసేన, బిజెపి నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యాక్ట్ పై సిబిఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు.
ప్రభుత్వ చట్టాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉండకూడదని ఆయన అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భూ సమస్యలు, వివాదాలు మరింత పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా చట్టం చేయాలని, అందుకు న్యాయవాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనకాపల్లిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిరసిస్తూ లాయర్లు చేపట్టిన దీక్ష వంద రోజులకు చేరుకున్న సందర్భంగా వారితో లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.