ఏపీలో తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ లు గత 29 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విధులలో చేరుకుంటే వారిపై ఎస్మా ప్రయోగిస్తామని వైసీపీ సర్కార్…అంగన్వాడీలకు డెడ్ లైన్ పెట్టింది. ఆ గడువు ఈ రోజుతో ముగిసిపోతున్న నేపథ్యంలో అంగన్వాడీలు మళ్ళీ విధుల్లోకి చేరుతారా అన్న ఆసక్తి ఏర్పడింది. అయితే, తాము మాత్రం వెనక్కి తగ్గేదే లేదని, తమ డిమాండ్లు పరిష్కరించి జీతాలు పెంచే వరకు సమ్మె చేస్తుంటామని అంగన్వాడీలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ అంగన్వాడీలు అత్యవసర సేవలు కిందకి వస్తే వారి నిత్యవసర డిమాండ్లను తప్పనిసరిగా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా నిలిచిన లక్ష్మిీనారాయణ వారిపై ఎస్మా ప్రయోగించడాన్ని ఖండించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అత్యవసర వైద్య సేవలు, రవాణా శాఖ ఉద్యోగులపై మాత్రమే ఎస్మా ప్రయోగిస్తారని, కానీ, ఈ ప్రభుత్వం అంగన్వాడీలపై కూడా ప్రయోగించిందని విమర్శలు వస్తున్నాయి.
దేనిపై ఎస్మా ప్రయోగించాలో దేనిపై ప్రయోగించకూడదో తెలియని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ సర్కారుపై వివి లక్ష్మీనారాయణ కూడా విమర్శలు గుప్పించారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన లక్ష్మీనారాయణ రాబోయే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీలపై ఎస్మా వ్యవహారంలో వీవీ లక్ష్మీనారాయణ లాజిక్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి.