ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, పోలింగ్ ముగిసిన మూడు రోజుల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గం, తిరుపతి, తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ, తిరుపతి ఎస్పీ మరికొందరు పోలీసు అధికారులపై ఈసీ వేటు వేసింది. అంతేకాకుండా, ఆ ఘటన సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచారణకు ఏకంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సిట్ విచారణ జరుగుతోంది.
ఈ రకంగా రాష్ట్రం హింసాత్మక ఘటనలతో, సిట్ విచారణలతో అట్టుడికిపోతున్న నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేని క్రమంలో సీఎం జగన్ ఎంచక్కా లండన్ చెక్కేశారు. ఈ వ్యవహారంపై ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. రాష్ట్రం రావణ కాష్టంలా మారినా సరే జగన్ మాత్రం తన ప్రయోజనాలే ముఖ్యమని లండన్ వెళ్లిపోయారని, ప్రజలను శాంతిభద్రతలను గాలికి వదిలేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసాత్మక ఘటనలు పూర్తిగా సద్దుమణగని పరిస్థితుల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించి వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం సరి కాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలోనే ఉండి శాంతిభద్రతలను సమీక్షించాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల సంఘం కేవలం ఎన్నికలను నడిపిస్తుందని, శాంతిభద్రతలు పరిరక్షించాల్సింది ముఖ్యమంత్రి, వారి మంత్రివర్గమని లక్ష్మీ నారాయణ చెప్పారు. రాష్ట్రంలో 144 సెక్షన్ కొన్నిచోట్ల కాగితంపై మాత్రమే ఉందని, అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.