అటు గుడివాడ, ఇటు కంకిపాడు కృష్ణా జిల్లాలో వరుస వివాదాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న వార్తలు ఊపందుకుంటున్నాయి. మరి ! వీటి వెనుక ఎవరున్నారో కానీ మళ్లీ క్యాసినో కల్చర్ కు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మీడియా లో ఈ వార్తలు గుప్పుమనడంతో ప్రస్తుతానికి ఓ అడుగు వెనుకకు వేశారని కూడా ప్రాథమిక సమాచారం.
అయితే వీటిని అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం చూసీ చూడని విధంగా ఉంది అన్న విమర్శలున్నాయి. ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయం కోసం విదేశీ మద్యంతో సహా అన్ని రకాల మద్యం బ్రాండ్ల సరఫరాకూ ఇక్కడ అనుమతులు ఇచ్చేయడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే అధిక ఆదాయం తెచ్చి పెట్టే శాఖగా ఏపీలో మంచి పేరున్న ఎక్సైజ్ శాఖ తాజాగా మరిన్ని క్యాసినోలకు అదేవిధంగా అక్కడ ఖరీదయిన మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో పడింది.
ఈ వ్యవహారంలో ఇద్దరు కీలక వైసీపీ నేతలు ఉన్నారని టీడీపీ ఆరోపిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేసి ఇక్కడి చీకటి కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదు అని, ఇవాళ ఆరంభం అయ్యే ఈ క్యాసినో కల్చర్ -కు పెద్ద, పెద్ద రాజకీయ నాయకులు ఆహ్వానితులుగా ఉన్నారని కూడా ప్రధాన మీడియా చెబుతోంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా రచ్చలేపిన గుడివాడ క్యాసినో మరువకముందే మరో క్యాసినోకు ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, కంకిపాడులో క్యాసినో ఏర్పాటుకు ఇవాళ సంబంధిత విందు, చిందులకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారని వార్తలందుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల మద్యం సరఫరా చేయవచ్చని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ మండిపడుతోంది. ప్రత్యేక పోస్టర్లను సైతం విడుదల చేసి, కొడాలి నానిని, వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ..మరి ! ఆయన ఏం మాట్లాడడం లేదు. పోలీసులు కూడా దీన్నొక చిన్నగెట్ టు గెదర్ గానే చూస్తున్నారు.ఇక ఈ క్యాసినోలో సినిమా తరహాలో డ్యాన్సులు, అదేవిధంగా జూదం కూడా జరిగేందుకు ఏర్పాట్లు జరిగేయని తెలుస్తోంది.
మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయిపోయారు. కానీ ఇక్కడి వాతావరణం పబ్ కల్చర్ తరహాలో ఉండనుందని, ఎంట్రీ టికెట్ ఇరవై వేల రూపాయలుగా నిర్ణయించి, వసూలు చేశారని కూడా చెబుతున్నారు. మరి! ఇప్పుడు ఈవెంట్లను రద్దు చేశారని మాత్రమే తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవి రద్దయిన రేపటి వేళ అవే బుకింగ్స్ తో అశ్లీల నృత్యాలు, పేకాట జరగవు అని ఏంటి గ్యారంటీ అని విపక్షం ప్రశ్నిస్తోంది.