నటుడు అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. `జనం కోసం` అనే పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపా రు. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో సర్కారు వైపు నుంచి ఇలా కేసు నమోదు కావడంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసు వివరాలు ఇవీ..
కసిరెడ్డి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో.. అక్కినేని నాగార్జున మాదాపూర్లోని హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేశారని.. దానిలో ఎన్-కన్వెన్షన్ నిర్మించారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి.. చెరువును ఆక్రమించి చేసిన నిర్మాణం కాబట్టి చర్యలు తీసుకోవాలని భాస్కరరెడ్డి కోరారు. దీనిని తొలుత న్యాయనిపుణులకు పంపించిన పోలీసులు.. తర్వాత కేసు నమోదు చేయడం గమనార్హం.
అయితే.. వాస్తవానికి ఎన్ – కన్వెన్షన్ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఆక్రమణలను నిర్ధారించామని.. నెల రోజుల కిందటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అయితే.. తాము అక్రమాలకు పాల్పడలేదని నాగార్జున అప్పట్లోనే ప్రకటించారు. ఆ వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఇచ్చే లోగానే నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
రాజకీయ రంగు!
అయితే.. హైడ్రా కూల్చివేసిన తర్వాత కూడా.. ఎన్ – కన్వెన్షన్పై కేసు నమోదు చేయడం చూస్తే.. దీనివెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఈలోగానే ఆమె సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, శాంతించని నాగార్జున కుటుంబం 100 కోట్లరూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు నమోదు కావడం .. రాజకీయంగా నాగార్జునను ఇరుకున పెడుతున్నారని టాలీవుడ్ సందేహాలు వ్యక్తం చేస్తోంది.