మచిలీపట్నం సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం మాయం అయిన కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య పేర్ని జయసుధ ఉన్నారు. ఆమెకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించింది అనుకుంటున్న పేర్ని నానికి షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో పేర్ని నానిని ఏ6గా పేర్కొంటూ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. పేర్ని నానిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే తనను ఏ6గా చేర్చడాన్ని సవాల్ చేస్తూ పేర్ని నాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నానికి కోర్టు ఊరటనిచ్చింది. సోమవారం వరకు నానిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న గోడౌన్ మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజులను పోలీసులు అరెస్టు చేయగా..వారికి న్యాయమూర్తి 12 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం వారంతా మచిలీపట్నం సబ్ జైలులో రిమాండ్ పై ఉన్నారు.