మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారంనాడు నాటకీయ పరిణామాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది. వివేకా వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి అప్రువర్ గా మారి రెండో సారి తన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులకు ఇవ్వడం, అందులో పలువురు వైసీపీ కీలక నేతల పేర్లు వచ్చాయని ప్రచారం జరగడం షాకింగ్ గా మారింది.
అదే సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలోని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ఈ హత్య కేసులో అనుమాతుడు కేసు పెట్టడం సంచలనంగా మారింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో తాము చెప్పినట్లుగానే చెప్పాలని రాంసింగ్ బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి అనే అనుమానితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం కడప రిమ్స్ స్టేషన్లో రాంసింగ్‌పై కోర్టు ఆదేశాలతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సంచలన కేసును దర్యాప్తు చేస్తున్న కీలక అధికారిపైనే ఆరోపణలు రావడం, కేసు పెట్టడం మరింత సంచలం రేపుతోంది. నమోదయింది. తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, కొంతమందికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారని యూఐసీఎల్ ఉద్యోగి, వివేకా కేసులో అనుమానితుడు అయిన ఉదయ్‌కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆల్రెడీ రాంసింగ్ పై అనంతపురం, కడప ఎస్పీలకు ఇద్దరు వ్యక్తులు గతంలో ఫిర్యాదు చేసినా..వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ఉదయ్ ఇచ్చిన మూడో ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.
అది కూడా ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఉదయ్ ఫిర్యాదుపై వెంటనే యాక్షన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓ సారి ఉదయ్ ను సీబీఐ అధికారులు విచారణ జరిపి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మరోసారి పిలిచి ప్రశ్నించారు. ఆ తర్వాత ఉదయ్ …పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవినాష్ రెడ్డి పేరు బయటకు వస్తుందన్న కారణంతోనే రాంసింగ్ పై కేసు పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. మరి, రాంసింగ్ వ్యవహారంలో ఏపీ పోలీసులు ఏవిధంగా ప్రవర్తిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.