టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుంటూరు పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. నడిరోడ్డులో దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలోనే లోకేశ్ ను నిన్న అదుపులోకి తీసుకొని వివిధ స్టేషన్లకు తిప్పిన పోలీసులు…ఏ కేసు పెట్టాలో తెలియక 151 సీఆర్పీసీ చట్టం కింద నోటీసులు జారీ చేసి వదిలేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు లోకేశ్ పై పాత గుంటూరు స్టేషన్లో కేసు నమోదైంది.
341, 353, 147 r/w, 149 r/w, 120B సెక్షన్ల కింద లోకేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ తో పాటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, శ్రావణ కుమార్, దూళిపాళ్లతో పాటు 33మంది టీడీపీ నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని.. అనధికారికంగా గుమిగూడటం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు.
అయితే, తమపై తప్పుడు కేసులు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు. తనను ఎందుకు అరెస్టు చేశారని గుంటూరు ఎస్పీని అడిగితే విచిత్రమైన సమాధానమిచ్చారని, తాను ఆస్పత్రికి వెళ్లకుండానే అక్కడకు వెళ్లి గొడవ చేసినందుకు కేసు పెట్టామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. 20 రోజుల్లో రమ్యశ్రీని హత్య చేసిన వారిని శిక్షించకుంటే 21వ రోజున భారీ స్థాయిలో ఉద్యమిస్తామని లోకేశ్ హెచ్చరించారు.
మరోవైపు, నేడు కర్నూలులో లోకేశ్ పర్యటించారు. ఏడాది క్రితం హత్యకు గురైన గోనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి కుటుంబాన్ని అఖిలపక్ష నేతలతో కలిసి లోకేశ్ పరామర్శించేందుకు లోకేశ్ కర్నూలు వెళ్లారు. అయితే, లోకేశ్ కాన్వాయ్‌ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దశలో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపుచేశారు.