‘పుష్ప-2’ సినిమా ప్రదర్శితమవుతున్న హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ లోకి హీరో అల్లు అర్జున్ వచ్చిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షో లో అల్లు అర్జున్ రావడం, ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన వైనం విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.
బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 105 (హత్య లేదా ప్రాణ నష్టం కేసు), 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నేరం రుజువైతే ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారని తమకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు.
అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు మృతురాలు రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే తన భార్య చనిపోయిందని ఆయన అన్నారు. తన కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కన్నీరుమున్నీరయ్యారు. బన్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పలువురు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.