పంజాబ్ లో కాంగ్రెస్ నాయకత్వ సమస్య పరిష్కారంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం అమరీందర్ సింగ్-ఫైర్ బ్రాండ్ నేత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు ముదిరిపోయిన విషయం తెలిసిందే. వీళ్ళద్దరి మధ్య సయోధ్య కుదర్చటానికి అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. సయోధ్యలో భాగంగా సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేయటమే కీలకమని అధిష్టానం నిర్ణయించింది. దీనికి అమరీందర్, సిద్ధూ కూడా అంగీకరించినట్లు ప్రచారం జరిగింది.
అయితే హఠాత్తుగా అమరీందర్ మాట్లాడుతు సిద్ధూని పీసీసీ ప్రెసిడెంట్ చేయటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. సిద్ధూకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయవకాశాలు తగ్గిపోతాయంటు బాహాటంగానే అభ్యంతరాలు చెప్పటంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ అమరీందర్ పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు.
హిందు, దళి వర్గాల్లోని ఎందరో సీనియర్లుండగా సిద్ధూని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే తీరని నష్టం తప్పదని అమరీందర్ చేసిన హెచ్చరికలు ఇపుడు సంచలనంగా మారింది. అమరీందర్ హెచ్చరికలు ఎలాగున్నా గురువారం రాత్రి సిద్ధూ పార్టీ అధ్యక్షురాలు సోనియాతో సమావేశమయ్యారు. పీసీసీ పగ్గాలు తనకే అప్పగించేందుకు సోనియా నిర్ణయించినట్లు ప్రచారం పెరిగిపోతోంది.
ఇదే సమయంలో ఢిల్లీలో సిద్ధూ, పంజాబ్ లో అమరీందర్ తమ మద్దతు ఎంఎల్ఏలతో వేర్వేరుగా సమావేశాలు జరపటంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది. సిద్ధూకే పార్టీ పగ్గాలు అప్పగిస్త ఎలాంటి వైఖరి అనుసించాలనే విషయమై అమరీందర్ నేతృత్వంలోని ఎంఎల్ఏలు చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో తనకు పీసీసీ పగ్గాలు అప్పగించిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై తన మద్దతుదారులతో సిద్ధూ మాట్లాడుకున్నారట. మొత్తానికి రెండు వర్గాల మధ్య పెరిగిపోతున్న గొడవలు చివరకు పార్టీ పుట్టుముంచుతుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.